Japan Ban Mangoes: అత్యంత కీలకమైన వేసవి మామిడి సీజన్లో భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఎదురదెబ్బ తగిలింది. భారతీయ ఎగుమతి ప్రాసెసింగ్ కేంద్రాలలో కీటకాల నివారణ (పెస్ట్-కంట్రోల్) ప్రక్రియలలో కొన్ని లోపాలను క్వారంటైన్ అధికారులు గుర్తించడంతో, భారత్ నుండి మామిడి పండ్ల దిగుమతులను జపాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ సస్పెన్షన్ (నిషేధం) కారణంగా కఠినమైన ఫైటోశానిటరీ నిబంధనల ప్రకారం జపాన్‌కు ఎగుమతయ్యే ఆల్ఫాన్సో, కేసర్, లంగ్రా ఇంకా బంగినపల్లి వంటి ప్రీమియం భారతీయ మామిడి రకాల షిప్మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారతీయ రవాణా సరుకులు తమ దేశపు మొక్కల ఆరోగ్య ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాయా లేదా అనేదానిపై జపాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
VHT కేంద్రాలలో లోపాలు.. ‘జీరో-టాలరెన్స్’ విధానమే కారణం!
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన తనిఖీలలో భారతదేశంలోని ‘వేపర్ హీట్ ట్రీట్మెంట్’ (VHT) కేంద్రాలలో కొన్ని నిర్వహణ పరమైన లోపాలను జపాన్ ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ముందు.. వాటిలో ఫ్రూట్ ఫ్లైస్ (పండ్ల ఈగలు) వంటి కీటకాలు లేకుండా శుద్ధి చేసే బాధ్యత ఈ కేంద్రాలదే.
జపాన్ దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర ముప్పుగా పరిణమించే ఇటువంటి కీటకాల విషయంలో ‘జీరో-టాలరెన్స్’ (అస్సలు సహించని) విధానాన్ని అనుసరిస్తుంది. ఈ తనిఖీల తర్వాత, మార్చి 25, 2026 తర్వాత జారీ చేసిన తనిఖీ ధృవీకరణ పత్రాలు (ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్లు) ఉన్న భారతీయ మామిడి సరుకులను ఇకపై అనుమతించబోమని యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ దిగుమతిదారులకు స్పష్టం చేసింది.
20 ఏళ్లలో మొదటిసారి.. ఇతర మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం!
గడిచిన దాదాపు 20 ఏళ్లలో భారతీయ మామిడి దిగుమతులపై జపాన్ విధించిన మొదటి పెద్ద నిరోధకం (నిషేధం) ఇదే కావడం గమనార్హం. గతంలో కూడా ఫ్రూట్ ఫ్లైస్ సమస్య కారణంగా టోక్యో ఇలాంటి నిషేధాన్నే విధించింది. ఆ తర్వాత భారతదేశం తన ట్రీట్మెంట్ ఇంకా సర్టిఫికేషన్ వ్యవస్థలను ఆధునీకరించడంతో, 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.
భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ మామిడి మార్కెట్లలో జపాన్ ఒకటి కాకపోయినప్పటికీ, ఈ నిషేధం భారతీయ వ్యవసాయ ఎగుమతుల ప్రతిష్టకు ఒక ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా భారతదేశ క్వాలిటీ-కంట్రోల్ అలాగే ఎగుమతి ప్రమాణాలపై మరింత నిఘా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ మార్పులతో ఇప్పటికే దెబ్బతిన్న రైతులు
ఈ నిషేధం టైమింగ్ మామిడి రైతులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని ఆల్ఫాన్సో బెల్ట్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, ఎల్ నినో (El Nino) వాతావరణ మార్పుల వల్ల రైతులు ఇప్పటికే తీవ్ర పంట నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ మద్దతుతో జరిపిన అంచనాల ప్రకారం ఈ సీజన్లో 85 నుండి 90 శాతం వరకు పంట నష్టం వాటిల్లినట్లు తేలింది.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. వార్షిక ఉత్పత్తి దాదాపు 28 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నప్పటికీ, అందులో ఎక్కువ భాగం దేశీయంగానే వినియోగించబడుతుంది.
పరిష్కారం కోసం చర్యలు
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి భారత అధికారులు, ఎగుమతిదారులు జపాన్ నియంత్రణ సంస్థలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. జపాన్ మార్కెట్‌ను మళ్లీ దక్కించుకోవాలంటే.. భారతదేశం తన ట్రీట్మెంట్ కేంద్రాలలో కఠినమైన పర్యవేక్షణ, బలమైన డాక్యుమెంటేషన్ విధానాలు మరియు కచ్చితమైన కీటకాల నివారణ చర్యలను పాటించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తనిఖీల సమయంలో గుర్తించిన నిర్దిష్ట సాంకేతిక లోపాలు ఏమిటనేది అటు భారత అధికారులు కానీ, ఇటు జపాన్ అధికారులు కానీ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు.
