Operation Mahadev: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు మరోసారి విజయం సాధించాయి. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు లష్కరే తయ్యబా ఉగ్రవాదులను సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్ శ్రీనగర్‌లోని హర్వాన్-లద్వాస్ ప్రాంతంలో, దాచిగామ్ అడవులకు సమీపంలో ఉన్న మహదేవ్ పర్వతాల మధ్య జరిగింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 25 మంది అమాయకులను, ఒక కశ్మీరీ వ్యక్తిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుండి భద్రతా దళాలు ఈ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు తెలిసి, నెలరోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ కోసం గత కొన్ని రోజులుగా బలగాలు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి.
దాచిగామ్ అడవుల్లో రెండు రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను భద్రతా దళాలు గుర్తించాయి. దీనికి తోడు, స్థానిక సంచార జాతుల వారు ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు విలువైన సమాచారం అందించారు. ఈ కీలక సమాచారంతో సోమవారం ఉదయం 11 గంటలకు ‘ఆపరేషన్ మహాదేవ్’ ప్రారంభమైంది. భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా, లిడ్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య తొలిసారి కాల్పులు జరిగాయి.
Also Read: Rajnath Singh: ఆపరేషన్ సింధూర్ – భారత సైనిక సాహసానికి నిదర్శనం
జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులూ విదేశీయులని, లష్కరే తయ్యబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) కు చెందిన వారని అధికారులు తెలిపారు. వీరిపై ఒక్కొక్కరి తలపై రూ. 20 లక్షల రివార్డు ఉందని సమాచారం. చనిపోయిన ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
లోక్‌సభలో చర్చ జరుగుతున్న వేళ కీలక ఎన్‌కౌంటర్:
ఒకవైపు ఢిల్లీలో లోక్‌సభలో ‘ఆపరేషన్ సింధూర్’పై చర్చ జరుగుతున్న వేళ, పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత శ్రీనగర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ మహాదేవ్ విజయవంతం కావడంతో, దేశ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని భారత భద్రతా దళాలు మరోసారి నిరూపించాయి.