Jai shankar: దేశ భద్రతను గణనీయంగా ప్రభావితం చేసిన ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న దౌత్య పద్ధతుల్లో విదేశీ నాయకుల ప్రమేయం లేదని ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రదాడులకు భారత ప్రభుత్వం గట్టి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిందని చెప్పారు. ప్రపంచం మొత్తంగా ఉగ్రవాదాన్ని నిరసిస్తూ భారత్‌కు మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన దాడికి కారణమైన టీఆర్ఎఫ్‌ను అమెరికా అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించిందని గుర్తు చేశారు.
భారత్ దాడులకు సమర్థవంతంగా ఎదురుదాడులు చేయగలదని నిరూపించిందని, ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచే కాల్పుల విరమణకు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. అయితే భారత్ మాత్రం డీజీఎంవో (DGMO) ద్వారా అధికారిక విజ్ఞప్తి వచ్చినప్పుడే స్పందిస్తామని స్పష్టంగా తెలిపిందని వివరించారు.
జైశంకర్ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఉన్న 193 దేశాల్లో కేవలం మూడు మాత్రమే పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచాయనడం గమనార్హం. క్వాడ్, బ్రిక్స్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించాయని వెల్లడించారు.
చైనా–పాకిస్థాన్ మధ్య సహకారం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించిన జైశంకర్, చైనాతో తమ సంబంధాలను తప్పుగా వ్యాఖ్యానిస్తూ ప్రతిపక్షాలు దారుణమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. తాను చైనాకు వెళ్లిందేమీ రహస్య ఒప్పందాల కోసమో, ఒలింపిక్స్ కోసం కాదని, దేశ భద్రత, వాణిజ్య అంశాలపైనే చర్చించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు.