Jagadish Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు. ఆయన తాజాగా జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తమ బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ మంత్రులు, పోలీసులు, చివరికి గుండాయిజాన్నే నమ్ముకున్నారు. కానీ, ప్రజలు ఈ రౌడీయిజాలను, బెదిరింపులను అస్సలు లెక్కచేయరు, అని జగదీష్ రెడ్డి అన్నారు. తండ్రిలాగే కొడుకు కూడా భయపెడతానంటూ మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరి బెదిరింపులకూ లొంగరని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి రౌడీలు, గుండాల సంగతి ప్రజలు ఎప్పుడో చూశారని, “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం వీళ్లు మర్చిపోయారు” అని జగదీష్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వస్తే ఆ ఉప్పెన ముందు ఎవరూ నిలబడలేరని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వభావం అదేనని, చిన్న టీ కొట్టు, కిల్లీ కొట్టు నడుపుకునే వాళ్లను కూడా భయపెట్టే వారిని నాయకులు అంటారా అని ప్రశ్నించారు. ఇటువంటి నాయకులు నిజంగా అవసరమా అని ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని జగదీష్ రెడ్డి పూర్తి ధీమా వ్యక్తం చేశారు.


