Iran

Iran: నిరసనల వేళ ఇరాన్ లో నో ఇంటర్నెట్‌.. స్టార్ లింక్ ని హాక్ చేశారా..?

Iran: ఇరాన్‌లో అణిచివేత పర్వం పరాకాష్టకు చేరింది. ఆయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే 500 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ముఖ్యంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఈ డిజిటల్ చీకటిలో ఇరాన్ నిరసనకారులకు ఆఖరి ఆశగా కనిపించిన ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ సేవలను కూడా ప్రభుత్వం ఇప్పుడు అడ్డుకుంటోంది.

స్టార్‌లింక్‌పై సైనిక దాడి..

సాధారణ ఇంటర్నెట్ లేని చోట శాటిలైట్ ద్వారా పనిచేసే స్టార్‌లింక్ ఇరాన్ ప్రజలకు పెద్ద అండగా నిలిచింది. కానీ, ఖమేనీ పాలన దీనిని అడ్డుకోవడానికి అత్యంత శక్తివంతమైన ‘మిలిటరీ గ్రేడ్ జామర్లను’ రంగంలోకి దించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇరాన్ ఒక ‘కిల్ స్విచ్’ను సక్రియం చేయడం ద్వారా స్టార్‌లింక్ సిగ్నల్స్‌ను దాదాపు 80 శాతం మేర నిలిపివేసింది. ఈ అత్యాధునిక సాంకేతికతను ఇరాన్ సొంతంగా తయారు చేయలేదని, దీని వెనుక రష్యా లేదా చైనా హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో ఇటువంటి పద్ధతులను వాడగా, చైనా కూడా ఇలాంటి సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఇది కూడా చదవండి: Revanth Reddy: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక.. డీఏ ఫైలుపై సీఎం సంతకం

రంగంలోకి దిగుతున్న అమెరికా.. ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ పౌరులను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగుతున్నారు. ఎలోన్ మస్క్‌తో మాట్లాడి ఇరాన్‌లో ఇంటర్నెట్ సదుపాయాన్ని పునరుద్ధరించే మార్గాలను అన్వేషిస్తామని ఆయన ప్రకటించారు. ఖమేనీ పాలనను హెచ్చరిస్తూ.. “శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను చంపడం ఆపాలి, లేదంటే అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. “మీరు కాల్పులు జరిపితే, మేము కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది” అంటూ యుద్ధానికి కూడా వెనుకాడబోమని పరోక్షంగా హెచ్చరించారు.

ఆర్థిక సంక్షోభం.. స్వేచ్ఛ కోసం పోరాటం

ఇరాన్‌లో కేవలం హింస మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా దిగజారాయి. తమ దేశ సంపదను గాజా, లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపులకు ఇస్తూ, సామాన్య ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తున్న ఖమేనీ విధానాలపై ఇరానియన్లు మండిపడుతున్నారు. క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావికి మద్దతుగా నినాదాలు చేస్తూ, స్వేచ్ఛా ఇరాన్ కోసం ట్రంప్ సహాయం కోరుతున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత వల్ల ఇరాన్ ప్రతి గంటకు సుమారు 1.56 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం తన పంతాన్ని వీడటం లేదు. 80 మిలియన్ల ప్రజలు ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ సమయంలో, అమెరికా మరియు మస్క్ తీసుకోబోయే చర్యలే ఇప్పుడు కీలకంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *