IPL 2026: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ తేదీ ఖరారైంది. ఈ ఏడాది ఐపీఎల్ సమరం మార్చి 28న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నట్లు టెలికాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేడి తగ్గకముందే వచ్చిన ఈ ప్రకటనతో క్రికెట్ ప్రియుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా, బీసీసీఐ ఇంకా పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్సీబీ
గత సీజన్ (2025) ఐపీఎల్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచింది. పద్దెనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఈసారి ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
చిన్నస్వామి స్టేడియానికి దక్కిన గౌరవం
ఈసారి ఐపీఎల్ 2026లో కీలక పోరాటాలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అందించిన సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో పలు విశేషాలు ఉన్నాయి:
-
హోం మ్యాచ్‌లు: ఆర్సీబీ జట్టు తన 7 హోం మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలోనే ఆడనుంది.
-
మేగా ఫైనల్: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.
-
రాయ్‌పూర్ వేదిక: మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను ఆర్సీబీ రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది.
ఎన్నికల ప్రభావం.. పూర్తి షెడ్యూల్ ఎప్పుడు?
సాధారణంగా ఐపీఎల్ ప్రారంభానికి నెల రోజుల ముందే పూర్తి షెడ్యూల్ వస్తుంది. అయితే ఈసారి దేశంలో ఎన్నికల షెడ్యూల్ ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అతి త్వరలోనే పూర్తి మ్యాచ్‌ల వివరాలు, వేదికల జాబితాను బోర్డు విడుదల చేసే అవకాశం ఉంది. వరుస ఐసీసీ ట్రోఫీలతో జోరు మీదున్న టీమిండియా ఆటగాళ్లు ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్‌లో తలపడనుండటం విశేషం.
