IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ మ్యాచ్‌ల వేదికలపై బీసీసీఐ (BCCI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికల కారణంగా లీగ్ దశ షెడ్యూల్‌ను రెండు విడతలుగా ప్రకటించిన బీసీసీఐ, ప్లేఆఫ్ షెడ్యూల్‌ను మాత్రం ఇప్పటివరకు సస్పెన్స్‌లోనే ఉంచింది.
రెండు రోజుల్లో కీలక ప్రకటన
మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సింగ్ ప్లేఆఫ్స్ వేదికలపై నోరు విప్పారు.
ప్లేఆఫ్స్ ఇంకా ఫైనల్ నిర్వహణకు అత్యంత అనువైన స్టేడియాలపై కసరత్తు దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ప్లేఆఫ్స్ తేదీలు ఇంకా వేదికలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
బెంగళూరులో సందడి ఉండబోతోందా?
గత సీజన్ ఫైనలిస్టులైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల హోమ్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయా అన్న ప్రశ్నకు దేవ్‌జిత్ సింగ్ ఆసక్తికరంగా స్పందించారు. “మీ ఊహకే వదిలేస్తున్నాను, నేను ఇప్పుడే ఏమీ చెప్పను.. రెండు రోజులు ఆగండి” అంటూ సమాధానం దాటవేశారు. దీంతో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్లేఆఫ్స్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అంచనా వేస్తున్న షెడ్యూల్ వివరాలు
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇలా ఉండే అవకాశం ఉంది:
-
క్వాలిఫైయర్ 1: మే 26
-
ఎలిమినేటర్: మే 27
-
క్వాలిఫైయర్ 2: మే 29
-
గ్రాండ్ ఫైనల్: మే 31
వేదికల మార్పులు – గతం మరియు వర్తమానం
ఈసారి కూడా ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) మరియు నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) ప్రధాన వేదికలుగా రేసులో ఉన్నాయి. గత సీజన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా (ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో) హైదరాబాద్ నుండి ముల్లన్‌పూర్‌కు, కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు మ్యాచ్‌లను తరలించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఎన్నికల ప్రభావం మరియు భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
