IPL 2026 Auction: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. అబుదాబి వేదికగా నేడు (డిసెంబర్ 16) మధ్యాహ్నం 2.30 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీల వ్యూహాలు, ఆటగాళ్ల తలరాతలు మారే ఈ వేదికపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
మొత్తం 369 మంది క్రికెటర్లు వేలంలోకి రానున్నారు. 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 77 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్ని జట్ల వద్ద మిగిలిన మొత్తం నగదు రూ. 237.55 కోట్లు.
క్యామరూన్ గ్రీన్‌పైనే అందరి చూపు
ఈ మినీ వేలంలో పెద్దగా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో, ఆస్ట్రేలియాకు చెందిన యువ సంచలనం, స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) పైనే ఫ్రాంచైజీల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Banana: పరగడుపున అరటి పండు మంచిదేనా?
అతడి ఆల్‌రౌండ్ నైపుణ్యం కారణంగా అత్యధిక ధర పలికే ఆటగాడిగా గ్రీన్ నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా, పర్స్‌లో అత్యధిక నగదు ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి జట్లు అతడి కోసం గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది.
విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త నిబంధన!
మెగా వేలంలో కాకుండా, మినీ వేలంలో పాల్గొని అత్యధికంగా నగదు పొందుతున్న కొంతమంది విదేశీ ఆటగాళ్ల ధోరణిపై ఫ్రాంచైజీలు గతంలో బీసీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
నిబంధన వివరాలు:
మినీ వేలంలో ఏ విదేశీ ఆటగాడికైనా రూ. 18 కోట్ల కంటే ఎక్కువ మొత్తం లభించదు. ఉదాహరణకు, ఒక విదేశీ ఆటగాడిని ఫ్రాంచైజీ రూ. 25 కోట్లకు కొనుగోలు చేస్తే, సదరు ఫ్రాంచైజీ పర్స్ విలువ నుంచి రూ. 25 కోట్లు మొత్తం కట్ అవుతుంది. అయితే, ఆటగాడికి మాత్రం రూ. 18 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన రూ. 7 కోట్లను (రూ. 25 కోట్ల – రూ. 18 కోట్లు) సదరు ఫ్రాంచైజీలు బీసీసీఐ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జమ అయిన మొత్తాన్ని బీసీసీఐ స్థానిక (భారతీయ) ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది.
ఈ కొత్త నిబంధన వల్ల, కామెరూన్ గ్రీన్ వేలం రూ. 30 కోట్లకు పలికినా కూడా అతడికి లభించే మొత్తం రూ. 18 కోట్లే అవుతుంది.
