Hyderabad: సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లిలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల లెక్చరర్లు అందరి ముందు తిట్టారనే బాధతో ఓ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (17) ప్రాణాలు కోల్పోయింది. ఎంఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్న సదరు విద్యార్థిని, గురువారం కాలేజీకి గంట ఆలస్యంగా వెళ్ళింది. ఈ క్రమంలో లెక్చరర్లు తోటి విద్యార్థుల ముందే ఆమెను తీవ్రంగా మందలించారు.
అందరి ముందు అవమాన పడ్డాననే బాధతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తన తల్లికి జరిగిన విషయం చెప్పి ఏడ్చింది. తల్లి ఆమెను ఓదార్చి, తర్వాత వెళ్లి కాలేజీలో మాట్లాడదామని సర్దిచెప్పింది. కానీ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆ విద్యార్థినికి కొద్దిసేపటికే తలనొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మల్కాజిగిరి ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గాంధీ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేసిన వైద్యులు షాకింగ్ విషయాన్ని చెప్పారు. విద్యార్థిని తీవ్రమైన మనస్తాపానికి (Emotional Stress) గురికావడం వల్ల ఆమె మెదడులో రక్తం గడ్డకట్టిందని నిర్ధారించారు. అప్పటికే ఆమె కాలు, చేయి పడిపోయాయి. పరిస్థితి విషమించడంతో ఆ బాలిక గురువారం రాత్రి మృతి చెందింది. లెక్చరర్ల ప్రవర్తన వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు కళాశాల ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్లు, ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
