Indiramma Mahila Dairy: రాష్ట్రంలో పాల ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు గేదెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలను గేదెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. తద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఇందిరా మహిళా డెయిరీ’ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గమైన ఖమ్మం జిల్లాలోని మధిరలో తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని అమలు చేస్తున్నారు.
Indiramma Mahila Dairy: ‘ఇందిరా మహిళా డెయిరీ’ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 4 లక్షలు కాగా.. ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అంటే ఒక్కో యూనిట్‌కు లబ్ధిదారులు కేవలం రూ. 40 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించలేని మహిళలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నారు.
Indiramma Mahila Dairy: పాలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. మధిర నియోజకవర్గంలో మొత్తం 62 వేల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా.. వారిలో 20 వేల మంది ఈ పథకంలో రూ. 2,100 చెల్లించి సభ్యులుగా చేరారు. ఈ 20 వేల మంది మహిళలకు విడతల వారీగా 40 వేల గేదెలను అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మహిళలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Indiramma Mahila Dairy: తొలి విడతలో 125 మంది లబ్ధిదారులకు 250 గేదెలను ఇప్పటికే పంపిణీ చేశారు. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఎర్రుపాలెం మండలంలో 5 వేల లీటర్ల సామర్థ్యం గల బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
Indiramma Mahila Dairy: ఇక్కడ రోజుకు 2 వేల లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయి. మధిర నియోజకవర్గంలోని మొత్తం 132 గ్రామాల్లో పాల సేకరణను విడతల వారీగా చేపట్టనున్నారు. అంతేకాకుండా, బోనకల్‌లో 9.5 ఎకరాల స్థలంలో పూర్తిస్థాయిలో డెయిరీ ప్లాంట్‌ను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్లాంట్‌లో పాల ప్యాకెట్‌లు, ఇతర పాల ఉత్పత్తులను కూడా తయారు చేయనున్నారు.
Indiramma Mahila Dairy: ప్రస్తుతం మహిళలకు 80 శాతం సబ్సిడీపై గేదెలు, 50 శాతం సబ్సిడీపై దాణాను అందిస్తున్నారు. భవిష్యత్తులో రైతులను పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సహించడం, నిరుద్యోగులకు పశువుల దాణా తయారీ, పాల ఉత్పత్తుల ప్యాకింగ్, అమ్మకం వంటి వ్యాపారాల ద్వారా ఉపాధి కల్పించాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. మధిర నియోజకవర్గంలో ఈ పథకం విజయవంతమైతే.. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు కూడా దీనిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Indiramma Mahila Dairy: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2013లోనే ఈ పథకం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తన సొంత నియోజకవర్గంలోనే దీనిని ప్రారంభించారు. మధిరలో ఈ పథకం అమలు తీరును బట్టి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా రాష్ట్రంలోని మహిళల అభివృద్ధికి దీనిని చేరువ చేసే అవకాశం రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుది. గ్రామీణ ప్రాంతాల వారికి ఎక్కువగా ఈ పథకాన్ని అమలు చేసి.. తద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్నదే అధికారంలో ఉన్న పార్టీ యోచన అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.