Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్తను అందజేసింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం కింద మంజూరై పూర్తయిన ఇండ్లను ఆగస్టు 22వ తేదీన ప్రారంభించే యోచనలో సర్కార్ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంతో లాంఛనంగా ఇండ్లను ప్రారంభించనున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు హర్షాతిరేకాలను వ్యక్తంచేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మరో అడుగు ముందుకు పడినట్టవుతుంది.
Indiramma Indlu: తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రజాపాలనలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం తొలుత దరఖాస్తులను స్వీకరించారు. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి మూడు జాబితాలుగా విభజించింది. తొలుత స్థలం ఉన్న వారికి తొలి జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. మలి జాబితాలో స్థలం కూడా లేని వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Indiramma Indlu: ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. అంతకు ముందు ఎంపికైన ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. పూర్తయిన ఇండ్ల లబ్ధిదారులకు తొలుత రూ.లక్ష చొప్పున నిధులను జమ చేశారు. కొన్ని గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు కూడా పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారు. శ్రావణమాసం ఈ ఆగస్టు 22వ తేదీతో ముగుస్తున్నందున, ఆలోపే నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యోచిస్తున్నట్టు తెలిసింది.
Indiramma Indlu: భాద్రపద మాసాన్ని సహజంగా శుభకార్యాలకు శూన్యమాసంగా భావిస్తారు. అందుకే ఆగస్టు 22లోపే పూర్తయిన ఇండ్ల గృహ ప్రవేశాలు చేయించేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని చుండ్రుగొండ మండలంలో ఇప్పటికే సుమారు 50 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మిగతా బిల్లులను కూడా మంజూరు చేయనున్నట్టు తెలుస్తున్నది.
