Indian Railways: కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి పెద్ద బృందంగా రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి నైరుతి రైల్వే (South Western Railway – SWR) శుభవార్త అందించింది. గ్రూప్ లేదా బల్క్ టికెట్ రిజర్వేషన్లకు సంబంధించిన పాత నిబంధనల స్థానంలో సరికొత్త మార్గదర్శకాలను (Commercial Circular No. 37/2026 / Rate Advice No. 11 of 2026) హుబ్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ రైల్వే విడుదల చేసింది. దీని ప్రకారం బల్క్ రిజర్వేషన్ల కింద కేటాయించే బెర్తుల సంఖ్యపై గతంలో ఉన్న గరిష్ఠ పరిమితిని (Ceiling Limit) పూర్తిగా తొలగించారు.
గ్రూప్ బుకింగ్ కొత్త నిబంధనల్లోని ముఖ్యాంశాలు.
-
బెర్తుల పరిమితి ఎత్తివేత: గతంలో గ్రూప్ రిజర్వేషన్ల కింద ఒక నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే బెర్తులను అనుమతించేవారు. తాజా సవరణ ప్రకారం ఆ గరిష్ఠ పరిమితిని ఎత్తివేశారు. ఇకపై ప్రధాన స్టేషన్లలోని చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్లు (CRS) లేదా స్టేషన్ మేనేజర్లు (SM) బల్క్ రిజర్వేషన్లను నేరుగా మంజూరు చేసే అధికారం కలిగి ఉంటారు. (అయితే అందుబాటులో ఉన్న బెర్తులు, నిబంధనలకు లోబడి ఈ కేటాయింపు ఉంటుంది).
-
ఎవరెవరికి ఈ సౌకర్యం వర్తిస్తుంది?: వివాహ వేడుకలకు వెళ్లే బృందాలు (Marriage parties), విద్యార్థుల విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు, క్రీడా జట్లు (Sports teams), సాంస్కృతిక బృందాలకు ఈ సదుపాయం లభిస్తుంది. టికెట్లు కన్ఫర్మ్, ఆర్ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ ఏవైనా సరే, అన్ని తరగతుల్లో (All Classes) ఈ గ్రూప్ బుకింగ్ అవకాశం ఉంటుంది.
-
రిటర్న్ జర్నీకి కూడా అవకాశం: ఒకే రిజర్వేషన్ కార్యాలయంలో తిరుగు ప్రయాణానికి (Return Journey) కూడా గ్రూప్ బుకింగ్ చేసుకోవచ్చు, అయితే దానిని ప్రత్యేక ప్రయాణంగా పరిగణిస్తారు.
దరఖాస్తు సమయం & తప్పనిసరి నిబంధనలు..
| అంశం | కొత్త నిబంధన వివరాలు |
| దరఖాస్తు సమయం |
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రారంభమైన రోజున సాధారణ బుకింగ్ మొదలైన గంట తర్వాత, అంటే ఉదయం 9:00 గంటల నుంచి ప్రధాన రిజర్వేషన్ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
|
| నేరుగా దరఖాస్తు చేయాలి |
ప్రయాణికులు నేరుగా సంబంధిత అధికారికి దరఖాస్తు సమర్పించాలి. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులను అనుమతించరు (విదేశీ పర్యాటకులు, NRIల రిజర్వేషన్లకు మాత్రమే ప్రస్తుత నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది).
|
| తప్పనిసరి వివరాలు |
దరఖాస్తు సమయంలో ప్రయాణానికి గల కారణాన్ని (Purpose of journey) స్పష్టంగా పేర్కొనాలి. అలాగే గ్రూపులోని ప్రతి ప్రయాణికుడి పేరు, వయసు, లింగం, చిరునామా వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ వివరాలు అసంపూర్తిగా ఉంటే అనుమతి నిరాకరిస్తారు.
|
దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు: నిజమైన ప్రయాణ బృందాలకు మాత్రమే ఈ సౌకర్యం అందేలా, బెర్తుల బ్లాకింగ్ వంటి దుర్వినియోగాలు జరగకుండా CRS/SM అధికారులు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించడంతో పాటు దరఖాస్తు, ప్రయాణికుల జాబితా ప్రతి పేజీపై సంతకం, సీల్ వేయాలని సౌత్ వెస్ట్రన్ రైల్వే స్పష్టం చేసింది.
