India Politics:దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు పలు కార్పొరేట్ సంస్థల నుంచి అందే విరాళాలు ఈ సారి గతేడాది కంటే మూడింతలు పెరిగాయి. నిరుడు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ట్రస్టుల ద్వారా రూ.1,218 కోట్ల విరాళాలు అందాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆ విరాళాల సంఖ్య రూ.3,811 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఏటేటా ఆ విరాళాల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
India Politics:సుప్రీంకోర్టు గతంలో వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్స్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు పెరిగినట్టు స్పష్టమవుతున్నది. భారత ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 9 ఎలక్టోరల్ ట్రస్టులు మొత్తం రూ.3,811.37 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు తేల్చి చెప్పింది. వీటిలో కేంద్రంలోని అధికార ఎన్టీయే కూటమిలోని ప్రధాన పార్టీ అయిన బీజేపీకి పెద్ద ఎత్తున విరాళాలు అందినట్టు తేల్చింది.
India Politics:బీజేపీకి వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి రూ.3,112.50 కోట్ల మేరకు విరాళాలు అందాయి. మొత్తం విరాళాల్లో ఇవి 82 శాతంగా ఉండటం గమనార్హం. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి రూ.298.77 కోట్లు విరాళంగా అందాయి. ఇది మొత్తం విరాళాల్లో 8 శాతంగా ఉన్నది. అదే విధంగా దేశంలోని మిగతా పార్టీలన్నింటికీ కలిపి రూ.400 కోట్ల వరకు విరాళాలు అందినట్టు స్పష్టమవుతున్నది.
