Vande Bharat Sleeper: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం పగటిపూట ప్రయాణాలకే పరిమితమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఇకపై రాత్రిపూట సుదూర ప్రయాణాలకు కూడా సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక రైలు తన తొలి ప్రయాణాన్ని గౌహతి – కోల్‌కతా నగరాల మధ్య సాగించనుంది. జనవరి 18 లేదా 19వ తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
అద్భుత వేగం.. అలుపెరుగని ప్రయాణం
ఈ స్లీపర్ రైలును సుమారు 1000 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే నగరాలను అనుసంధానించేలా రూపొందించారు. ఇటీవల రాజస్థాన్‌లోని కోటా – నాగ్దా సెక్షన్ల మధ్య నిర్వహించిన హై-స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 182 కిలోమీటర్ల (182 Kmph) వేగాన్ని అందుకుని రికార్డు సృష్టించింది. విశేషమేమిటంటే, అంత వేగంతో వెళ్తున్నప్పటికీ రైలులో కనీసం కుదుపులు కూడా ఉండవని నిరూపించడానికి ఒక వీడియోను మంత్రి షేర్ చేశారు. అందులో గ్లాసు నిండా నీళ్లు పోసి ఉంచినా, రైలు గరిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు కూడా ఒక్క చుక్క నీరు కూడా తొణకకపోవడం ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: Cigarette Prices: సిగరెట్, పాన్ మసాలాపై 40% జీఎస్టీ; ఫిబ్రవరి 1 నుంచి అమలు
విమాన ప్రయాణం కంటే తక్కువ ధరకే..
మధ్యతరగతి ప్రయాణికులకు ఈ రైలు ఒక వరమని చెప్పవచ్చు. ప్రస్తుతం గౌహతి – కోల్‌కతా మధ్య విమాన టికెట్ ధరలు రూ. 6,000 నుండి రూ. 10,000 వరకు ఉండగా, వందే భారత్ స్లీపర్‌లో ధరలు చాలా అందుబాటులో ఉన్నాయి:
3 AC: సుమారు రూ. 2,300 (ఆహారంతో కలిపి)
2 AC: సుమారు రూ. 3,000
1 AC: సుమారు రూ. 3,600
ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు భద్రత
మొత్తం 16 కోచ్‌లతో నడిచే ఈ రైలులో అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రత కోసం రైలు ప్రమాదాలను నివారించే ‘కవచ్’ (Kavach) సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. వీటితో పాటు మరిన్ని ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి:
ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక బయో-టాయిలెట్లు.
నిప్పును గుర్తించే ఫైర్ సెన్సార్లు, సీసీటీవీ నిఘా.
నడుము నొప్పి లేకుండా ఉండేలా డిజైన్ చేసిన సౌకర్యవంతమైన బెర్త్‌లు.
ప్రయాణికులకు సమాచారం అందించే డిజిటల్ సిస్టమ్స్.
రైల్వే శాఖ ప్రణాళిక ప్రకారం, 2026 చివరి నాటికి సుమారు 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. రాబోయే ఆరు నెలల్లోనే మరో ఎనిమిది రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ కొత్త రైళ్ల రాకతో సుదూర ప్రయాణాలు మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా మారనున్నాయి.
