Daminedu: తిరుపతి గ్రామీణ మండలం దామినేడులో చోటుచేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ఇంట్లో దంపతులు, వారి రెండేళ్ల కుమారుడు మృతిచెందిన విషయం ఆలస్యంగా బయటపడింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా అనుమానించిన పొరుగువారు అక్కడికి వెళ్లి చూడగా, పూర్తిగా కుళ్లిపోయిన మూడు మృతదేహాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు తమిళనాడులోని గుడియాత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్, ఆయన భార్య పొంగుతై, కుమారుడు మనీష్‌గా గుర్తించారు. మృతదేహాల పరిస్థితి చూస్తే, ఈ ఘటన వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
Also Read: Prakasam District: డ్రైవర్, క్లీనర్ వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పు
కుటుంబం ఏ కారణం చేత ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆర్థిక సమస్యలేనా, వ్యక్తిగత కారణాలా, లేక మరేదైనా ఒత్తిడా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటన దామినేడు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న పిల్లవాడితో పాటు మొత్తం కుటుంబం ఇలాగే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కన్నీళ్లు పెట్టేలా చేసింది.

