Imran Khan: పాకిస్తాన్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతకు, గందరగోళానికి కారణమైన మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణ పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ చనిపోలేదని, ప్రాణాలతో, ఫిట్‌గా ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ మంగళవారం (డిసెంబర్ 2, 2025) స్పష్టం చేశారు.
పుకార్ల వెనుక కథేంటి?
గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ బయటికి కనిపించకపోవడం, భద్రతా కారణాలు చెబుతూ కుటుంబ సభ్యులను కూడా కలవడానికి జైలు అధికారులు అనుమతించకపోవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ సహా పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైలులో హత్యకు గురయ్యారని సంచలన వార్తలు పోస్ట్ చేశాయి. దీనికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను నిందిస్తూ ఒక ఫొటోను కూడా విడుదల చేయడంతో, ఈ మరణ పుకార్లు పాకిస్తాన్‌లో అగ్గి రాజేశాయి.
ఇది కూడా చదవండి: India Vs South Africa: రాయ్‌పూర్… టీమిండియా అడ్డా!.. సిరీస్ ఫలితాన్ని తేల్చే రెండో వన్డే నేడు!
ఈ పుకార్లతో ఇమ్రాన్ కుటుంబ సభ్యుల్లో, పీటీఐ కార్యకర్తల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. ఇమ్రాన్‌ను తమకు చూపించాలంటూ పీటీఐ కార్యకర్తలు అడియాలా జైలు ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఎట్టకేలకు సోదరీమణులకు అనుమతి
దీంతో, చేసేది లేక పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చింది. మంగళవారం రోజున ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో కలిసేందుకు ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లకు అనుమతి ఇచ్చింది. జైలులో సోదరుడిని కలిసిన తర్వాత ఉజ్మా ఖాన్ మీడియాతో మాట్లాడారు.
మానసిక హింసకు గురి చేస్తున్నారు
తమ సోదరుడు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడని, ఆరోగ్యంగా ఉన్నాడని ఉజ్మా ఖాన్ తేల్చి చెప్పడంతో మరణ పుకార్లన్నీ వట్టివేనని తేలిపోయింది. అయితే, జైలులో ఇమ్రాన్‌కు ఎదురవుతున్న పరిస్థితులపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు, ఫిట్‌గా ఉన్నారు. కానీ ఆయనను జైల్లో మానసిక హింసకు గురి చేస్తున్నారు. ఎవరితోనూ సంభాషించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదు. జైలు అధికారుల తీరుపై ఇమ్రాన్ తీవ్ర కోపంతో ఉన్నారు అని ఉజ్మా ఖాన్ వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారన్న ఆందోళనలు ఈ ప్రకటనతో తొలిగిపోయినప్పటికీ, ఆయనపై జైలులో జరుగుతున్న మానసిక హింసకు సంబంధించిన ఉజ్మా ఖాన్ ఆరోపణలు పాకిస్తాన్ రాజకీయాల్లో మరో వివాదానికి తెర తీసేలా కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ బయటికి కనిపించకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ‘భద్రత’ కాదని, ఉద్దేశపూర్వకంగా ఆయన్ను ఒంటరి చేసి ‘మానసిక హింస’కు గురి చేయడమేనని ఈ ప్రకటనతో స్పష్టమవుతోంది.

