Hyderabad: హైదరాబాద్‌కు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే కొన్ని గంటల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ వంటి పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతుందని అంచనా. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇంకా వర్షాలు కురిస్తే రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాలను, నీటితో నిండిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు కాబట్టి, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే ఛార్జ్ చేసుకోవడం మంచిది. ఏదైనా సహాయం కోసం జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు.

