Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. కిలో హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత!

Shamshabad Airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి డ్రగ్స్ కలకలంతో వార్తల్లో నిలిచింది. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, నిఘా పెంచుతున్నా కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మత్తు పదార్థాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విదేశాల నుండి వచ్చిన ఓ విమానంలో భారీగా ‘హైడ్రోపోనిక్ గంజాయి’ పట్టుబడటం సంచలనంగా మారింది.

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరం నుండి శంషాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ అక్రమ రవాణా బయటపడింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా, ప్రయాణికులు కూర్చునే సీట్ల కింద ఈ డ్రగ్స్ దాచినట్లు గుర్తించారు. విమానంలోని సీట్ నంబర్ 16 మరియు 17 కింద ప్యాకెట్లలో దాచి ఉంచిన సుమారు ఒక కిలో హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విమానం దిగే సమయంలో దొరికిపోతామనే భయంతో నిందితులు ఆ గంజాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణ గంజాయితో పోలిస్తే ఈ హైడ్రోపోనిక్ గంజాయి చాలా ఖరీదైనది మరియు శక్తివంతమైనది. ప్రస్తుతం ఆ సీట్లలో ప్రయాణించిన వారు ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చారు? అనే వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు విమాన ప్రయాణికుల జాబితాను మరియు సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *