Hyderabad: సోమవారం సాయంత్రం నగరంలోని ఉప్పల్, అంబర్‌పేట ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఒకవైపు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్, మరోవైపు అంబర్‌పేటలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన ఉండటం వల్ల ట్రాఫిక్ దారులను మళ్లిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి.
దారి మళ్లింపులు ఇలా ఉంటాయి:
చంగిచర్ల, బొడుప్పల్, పీర్జాదిగూడ వైపు నుంచి ఉప్పల్‌కి వచ్చే వాహనాలు హెచ్‌ఎండీఏ భాగాయత్ నుంచి నాగోల్ వైపు మళ్లించబడతాయి.
ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి హెచ్‌ఎండీఏ లేఅవుట్ వైపు మళ్లిస్తారు.
తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ, నాచారం, చెర్లపల్లి ఐఓసిఎల్ మార్గం, స్ట్రీట్ నెం. 8, మెట్రో పిల్లర్ 972 వద్ద యు-టర్న్ ద్వారా ఉప్పల్ ఎక్స్ రోడ్ వైపు తరలిస్తారు.
రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలను స్ట్రీట్ నంబర్ 8 ద్వారా హబ్సిగూడ వైపు మళ్లించనున్నారు.అంబర్‌పేటలో కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాయంత్రం 5:30 గంటలకు అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఆ తరువాత 6 గంటలకు జీహెచ్ఎంసీ అంబర్‌పేట స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అంబర్‌పేట మునిసిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమాల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.