Hyderabad: అయ్యప్ప దీక్ష అంటే ఒక మండలం (41) రోజులు అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రతో ముగుస్తుంది. ఈ 41 రోజుల్లో అయ్యప్ప మాల ధరించిన వారిని ఇతరులు భగవంతుని రూపాలుగా భావిస్తారు. అందుకే అందరూ అయ్యప్ప స్వామి అని పిలుచుకుంటారు. ఈ రోజుల్లో దుర్భాషణలకు దూరంగా ఉంటారు. శరణు ఘోషతో కఠిన నియమాలతో నడుచుకుంటారు. ఎలాంటి తప్పులు చేయకుండా క్రమశిక్షణతో ఉంటారు. కానీ, కొందరు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఇదే అయ్యప్ప మాల ముసుగులో లంచాలకు తెగబడుతూ అయ్యప్పమాల పవిత్రతను దెబ్బతీస్తుంటారు. అలాంటి అయ్యప్పమాల ధరించిన ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే ఇలాంటి లంచాలు తీసుకుంటూ దొరికిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్నది.
Hyderabad: హైదరాబాద్-సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో అయ్యప్పమాల వేసిన సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ ఆ మాల పవిత్రతను దెబ్బతీశారు. ఇతరులు అసహ్యించుకునేలా చేయని పాపానికి ఒడిగట్టారు. ఎప్పుడూ చేసేదే కదా అనుకొన్న ఆ ఇద్దరూ.. అయ్యప్ప మాల వేసుకున్నామన్న భయమే లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ విషయాలను పసిగట్టిన ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా ఆ ఇద్దరినీ పట్టుకున్నారు.
Hyderabad: ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయ్యప్ప మాలధారులు, ఇతర భక్తులు ఆ ఇద్దరిపై పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నారు. అయ్యప్ప మాల పవిత్రతను దెబ్బతీశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కిరణ్, భాస్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

