Nampally: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం సంభవించిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బచస్ ఫర్నిచర్ క్యాస్టిల్ అనే దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్నాయి. చైనా నుండి దిగుమతి చేసుకున్న ఫర్నిచర్, ప్లాస్టిక్, ఫైబర్ మండే స్వభావం గల రసాయనాలు సెల్లార్లో భారీగా నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లో భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, వారిని రక్షించేందుకు సాహసించి లోపలికి వెళ్లిన మరో ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు.
ఈ ప్రమాదం జరిగిన తీరు ఎంతో హృదయవిదారకంగా ఉంది. భవనం సెల్లార్లో వాచ్మెన్ కుటుంబం నివసిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో యాదయ్య, లక్ష్మి దంపతులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, వారి కుమారులు ప్రణీత్ (9), అఖిల్ (12) ఇంట్లోనే ఉండిపోయారు. మంటలు అంటుకున్న సమయంలో సెల్లార్లో ఉన్న చిన్నారులతో పాటు బేబీ (45) అనే మహిళ బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. వారి ఆర్తనాదాలు విన్న ఫర్నిచర్ షాపు ఉద్యోగి మహ్మద్ ఇంతియాజ్ (28), ఆటో డ్రైవర్ హబీబ్ (32) ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు సెల్లార్లోకి వెళ్లారు. అయితే, లోపల పేరుకుపోయిన దట్టమైన ప్లాస్టిక్ పొగ వల్ల ఊపిరి ఆడక ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
Also Read: Kurnool: కర్నూలులో దారుణం.. ప్రియుడి భార్యపై వైరస్ ఇంజెక్షన్ దాడి
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సుమారు 22 గంటల పాటు భారీ రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, దట్టమైన పొగ లోపల అస్తవ్యస్తంగా ఉన్న ఫర్నిచర్ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. భవనంలో గాలి పీల్చుకోవడం కష్టమవ్వడంతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లను, రోబో ఫైటర్లను కూడా వినియోగించారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో ప్రమాదకరమైన ఫర్నిచర్ నిల్వ చేయడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విపత్తు నిర్వహణ శాఖను ఆదేశించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, కలెక్టర్ హరిచందన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. సురక్షిత నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
