Crime News: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జిలో రేణుక అనే యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. అల్వాల్‌కు చెందిన రేణుకకు(26) గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్(34) అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వారిద్దరూ నిన్న రాత్రి సదరు లాడ్జిలోని రూమ్ నంబర్ 1611 బుక్ చేసుకుని అక్కడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే, ఈ ఘటనపై ఫారుక్ పోలీసులకు ఒక వెర్షన్ వినిపించాడు. తాను కొద్దిసేపు వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లి తిరిగి గదికి వచ్చేసరికి, రేణుక లోపల ఉరివేసుకుని విగతజీవిగా కనిపించిందని అతడు పోలీసులకు తెలిపాడు. కానీ, రేణుక మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఆత్మహత్య కాదని, ఫారుకే ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, రేణుకతో పాటు గదిలో ఉన్న ఫారుక్‌ను తక్షణమే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించడంతో పాటు, పోస్టుమార్టం తుది నివేదిక ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే రేణుక మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెల్లడి కానున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.
