Crime News: హైదరాబాద్‌లో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, అనంతరం అతి క్రూరంగా హత్య చేసిన ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. ఈ దారుణం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది.
చత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు వారి ముగ్గురు పిల్లలతో కలిసి రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో నివసిస్తున్నారు. ఈశ్వర్ పాండే స్థానికంగా ఒక టింబర్ డిపోలో పనిచేస్తుండగా, అదే డిపోలో బీహార్‌కు చెందిన కమర్ అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. ఆగస్టు 12న పాండే దంపతుల ఐదేళ్ల కొడుకు మనోజ్ పాండే కనిపించకుండా పోయాడు. వెంటనే వారు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: Ambati Fake Factory: జగన్ దొంగ ఓట్ల ఆరోపణలు.. లెవెల్ చేసిన అంబటి!
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ పరిశీలనలో, బాధితుడి ఇంటికి సమీపంలో నివసించే కమర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కమర్ తాను చేసిన దారుణాన్ని అంగీకరించాడు. మనోజ్ పాండేను కిడ్నాప్ చేసి, సమీపంలోని ముళ్లపొదల్లో లైంగిక దాడి చేశాడని, ఆపై గొంతు నులిమి హత్య చేశాడని తెలిపాడు.
నిందితుడు కమర్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మనోజ్ పాండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దారుణానికి ఒడిగట్టిన కమర్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురీకి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.