Hyderabad: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం (జనవరి 17) నిర్వహించ తలపెట్టిన సికింద్రాబాద్ బచావో ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులకు దిగారు. ర్యాలీలు తీయకుండా ప్రధాన కేంద్రాల్లో పోలీసులు పహారా కాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా వారి ఇండ్ల వద్ద కాపలా ఉన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

Hyderabad: నల్లజెండాలు, కండువాలు ధరించిన బీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు ర్యాలీగా వెళ్లారు. మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎంజీరోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రారంభం కాకముందు సికింద్రాబాద్ రైల్వేస్టేసన్ పరిసర ప్రాంతాల్లో, అక్కడి హోటళ్లలో కూర్చున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Hyderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్యాట్నీ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కనిపించినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ఫా హోటల్‌లో టిఫిన్ చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి, హోటల్‌ను మూసి వేయించారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున వచ్చిన స్థానికులు పోలీసుల తీరుపై మండిపడ్డారు.
ర్యాలీ నిర్వహించే హక్కు మాకు లేదా: తలసాని
Hyderabad: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ నిర్వహించేందుకు తమకు హక్కు లేదా? అని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించేందుకు 5 రోజుల ముందే తాము అనుమతి కోరితే రాత్రి 10:40 గంటలకు పోలీసులు అనుమతిని నిరాకరిస్తున్నట్టు చెప్పారని తెలిపారు. ముందే అనుమతి లేదని చెప్పి ఉంటే, తాము కోర్టుకు వెళ్లేవారిమని తెలిపారు. అనుమతి లేకున్నా, సీఎం రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్ ముందు ర్యాలీ చేస్తే అనుమతి ఎలా ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. కర్య్ఫూను తలపించేలా పోలీసులను పెట్టి నిర్బంధించడం అక్రమమని తలసాని విమర్శించారు.
