VC.Sajjanar

VC.Sajjanar: ‘ఆపరేషన్‌ కవచ్‌’.. 5 వేల మంది పోలీసులతో హైదరాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు

VC.Sajjanar: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను పటిష్టం చేసే దిశగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు కీలక ముందడుగు వేశారు. సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి పర్యవేక్షణలో, ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) పేరుతో డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా అకస్మాత్తుగా విస్తృతమైన నాకాబందీ నిర్వహించారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని స్థాయిలో, దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాలలో ముమ్మర తనిఖీలు చేపట్టడం ఈ డ్రైవ్‌లో ప్రధానాంశం.

వివిధ విభాగాల సమన్వయంతో తనిఖీలు

ఈ ‘ఆపరేషన్ కవచ్’ ప్రత్యేక డ్రైవ్‌లో వివిధ విభాగాల సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటుగా ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR), బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సైతం ఈ నాకాబందీలో భాగమయ్యాయి. ఇది ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన కార్యక్రమంగా సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Diet Soft Drinks: జీరో షుగర్ లేదా డైట్ సోడా.. ఏది ఆరోగ్యకరమైనది?

ప్రజలకు సీపీ విజ్ఞప్తి

ఈ మెగా ఆపరేషన్‌పై కమిషనర్ సజ్జనార్ కీలక పోస్ట్ చేస్తూ.. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి నగర పౌరులందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనించినా లేదా అసాధారణ పరిస్థితులు కనిపించినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని నగర ప్రజలకు సూచించారు.

ఈ భారీ నాకాబందీతో నగరంలో నేర కార్యకలాపాలను అదుపు చేయడంతో పాటు, పౌరులలో భద్రతా భావాన్ని మరింత పెంపొందించడం పోలీసుల లక్ష్యంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *