Defence Budget: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై మరింత దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా రూపాయల 50,000 కోట్ల అదనపు నిధులు రక్షణ శాఖకు కేటాయించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న రూ.6.81 లక్షల కోట్ల బడ్జెట్‌తో కలిపితే, మొత్తం రక్షణ బడ్జెట్ ఏకంగా రూ.7 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదనపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది. పాక్ ప్రేరిత ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అయితే, భారత ఆర్మీ చేసిన ఎదురుదాడులకు తట్టుకోలేని పాకిస్తాన్ చివరకు వెనక్కి తగ్గడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ముసళధార దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్‌లోని కొన్ని ఎయిర్‌బేస్‌లు, ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి.
ఈ విజయాల నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచాలని నిర్ణయించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ఇప్పటికే ₹6.81 లక్షల కోట్లు కేటాయించగా, అదనంగా మరో ₹50,000 కోట్లు జత చేస్తే, బడ్జెట్ మొత్తం ₹7 లక్షల కోట్లకు పైగా అవుతుంది.
Also Read: James Comey: ట్రంప్‌ను చంపేస్తామంటూ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు!
ఆయుధాల కొనుగోలు, పరిశోధనకు పెద్దపీట
ఈ అదనపు నిధులను ప్రధానంగా అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, అత్యవసర పరికరాల సేకరణకు ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం జీడీపీలో రక్షణ ఖర్చు 1.91 శాతంగా ఉంది.
2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ రంగంపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. అప్పట్లో బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లుండగా, ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
