Rajamouli: టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్లోబల్ స్థాయిలో అంచనాలతో తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ చిత్రం ‘SSMB29’ టైటిల్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే పేరును అధికారికంగా ప్రకటిస్తూ, హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్ ట్రోటర్’ పేరుతో అత్యంత వైభవంగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చగా, రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం భారీ వివాదానికి దారితీశాయి.
₹1200 కోట్ల ‘వారణాసి’
‘వారణాసి’ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కే.ఎల్. నారాయణ ఏకంగా ₹1200 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రాజమౌళి కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌గా రికార్డు సృష్టిస్తోంది.
మహేష్ బాబు ఈ చిత్రంలో ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఎద్దుపై కూర్చుని, రుద్ర శక్తితో ముందుకు దూసుకెళ్తున్న మహేష్ గ్లింప్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది.
ఇది కూడా చదవండి: Aditi Rai: అది నేను కాదు… ఎవరూ నమ్మవద్దు
పాన్-ఇండియా కాకుండా, గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. చీరకట్టులో గన్ పట్టుకుని యాక్షన్ చేస్తున్న ఆమె ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో ‘కుంభ’ అనే ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
రాజమౌళి వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఆగ్రహం
‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈవెంట్ సందర్భంగా టెక్నికల్ సమస్యల కారణంగా గ్లింప్స్ విడుదల ఆలస్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, తన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకున్నారు.
విజయేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో, “హనుమంతుడు రాజమౌళి వెనుక ఉన్నాడు, అందుకే ఈ సినిమా చేస్తున్నాడు” అని పేర్కొన్నారు. దీనిని ప్రస్తావిస్తూ రాజమౌళి, “నాకు దేవుడిపై అంత నమ్మకం లేదు. మా నాన్న ‘హనుమంతుడు నీ వెనుక ఉన్నాడు’ అని అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. ఇది నడిపించేదేనా అనిపించింది” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సమస్యకు దేవుడిని అనవసరంగా లాగడం ఎందుకని, “హనుమంతుడిని అవమానించే హక్కు ఎవరికీ లేదు” అని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం #RespectHanuman అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కొందరు అభిమానులు రాజమౌళి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని వాదిస్తున్నారు. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఈ వివాదం కొనసాగుతోంది.
ఒకవైపు అంచనాలను అమాంతం పెంచేసిన ‘వారణాసి’ గ్లింప్స్, మరోవైపు దర్శకుడి వ్యాఖ్యలతో మొదలైన వివాదం… ఈ రెండు అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

