Anantapur: అనంతపురం జిల్లాలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య నెలకొన్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా శుక్రవారం ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంతూరు తిమ్మంపల్లిలో పోలీసులకు అడ్డుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం సిద్ధమయ్యారు. అయితే, ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కేతిరెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేయడంతో, పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Cyber Fraud: వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్స్ తెరిచాడు.. రూ.70 వేలు గైప్
కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి రానిచ్చేది లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తిమ్మంపల్లితో పాటు తాడిపత్రిలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.