Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హేజో లేబొరేటరీస్ (హెజిలో ఫార్మా) కెమికల్ కంపెనీలో రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు ధాటికి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో పరిశ్రమ ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది.
క్షణాల్లో చెలరేగిన మంటలు – కార్మికుల ఆర్తనాదాలు..
-
నైట్ షిఫ్ట్‌లో విషాదం: కంపెనీలోని ‘సి-బ్లాక్’లో రాత్రి వేళ సుమారు 18 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. రియాక్టర్ వద్ద పనులు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర శబ్దంతో పేలుడు సంభవించింది.
-
ఇద్దరు మృతి – హైదరాబాద్‌కు క్షతగాత్రులు: పేలుడు ధాటికి నల్గొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్నబోయిన నరేష్ కుమార్ అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన పది మందిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
-
భయంతో రోడ్లపైకి స్థానికులు: రియాక్టర్ పేలిన తీవ్రతకు చుట్టుపక్కల గ్రామాలు దద్దరిల్లడంతో భూకంపం వచ్చిందేమోనన్న భయంతో గ్రామస్తులు అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చౌటుప్పల్ రూరల్ సీఐ సతీష్‌రెడ్డి, ఎస్సై జగన్ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకోగా.. చౌటుప్పల్, హయత్‌నగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
నెలల వ్యవధిలోనే రెండో ప్రమాదం – యాజమాన్యంపై ఆగ్రహం..
హేజో లేబొరేటరీస్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసిందని స్థానికులు మండిపడుతున్నారు:
-
గతంలోనూ కార్మికుడి బలి: గత జూలై 16న ఇదే కంపెనీలో ప్రమాదకర రసాయన వాయువులు లీక్ కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఆలమూరు కృష్ణారెడ్డి (42) అనే కార్మికుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ విషాదం జరిగి నెల రోజులు గడవకముందే మళ్లీ రియాక్టర్ పేలడం తీవ్ర కలకలం రేపింది.
-
కాలుష్యం & దుర్వాసన: ప్రమాదం జరిగినప్పటి నుంచి పరిసర గ్రామాల్లో తీవ్రమైన రసాయన దుర్వాసన వ్యాపిస్తోందని, స్థానికులకు తలతిరగడం, వాంతులు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
కఠిన చర్యలకు డిమాండ్: సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి (PCB), కార్మిక శాఖ అధికారులు పరిశ్రమలో భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
