Rain Alert: తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
జిల్లాలపై భారీ వర్షాల ప్రభావం
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో గాలివానతో పాటు వర్షం పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో కూకట్పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం నమోదైంది.
వాతావరణ శాఖ హెచ్చరిక
వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడనున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించారు.
వర్షాలతో తాత్కాలిక ఉపశమనం
మార్చి 21 నుంచి 23 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి, వేసవి తీవ్రత కొంతవరకు తగనుంది.
