Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరోసారి వాన దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అరగంటలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ అకాల వర్షంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
ఎక్కడ చూసినా నీళ్లే..
ఎస్.ఆర్. నగర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్‌పేట్, ఫిలింనగర్ లాంటి ముఖ్య ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. అపార్ట్మెంట్ల బేస్మెంట్లు, ఇళ్లలోకి కూడా నీరు చేరింది. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో చాలా చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. నాలాలు కూడా పొంగిపొర్లడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు
గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, రాబోయే రెండు గంటల్లో ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, యాదాద్రి – భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నగరవాసులకు హెచ్చరిక
హైదరాబాద్‌లో వర్షాలు పడే ప్రాంతాలపై వాతావరణ శాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఉత్తరం, పశ్చిమం, మధ్య హైదరాబాద్‌లోని సెర్లింగంపల్లి, కూకట్పల్లి, షేక్‌పేట్, ఖైరతాబాద్, టోలీచౌకి, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. ఆ తర్వాత మెహదీపట్నం, చార్మినార్, నాంపల్లి లాంటి దక్షిణ హైదరాబాద్ వైపు కూడా వర్షం విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నగర ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై నిలిచిన నీటిలో వెళ్లకపోవడం మంచిదని చెప్పారు.