Harish Rao

Harish Rao: రేవంత్ వదిలేసిన నీటితో ఏపీలో పంటలు.. ఇక్కడేమో క్రాప్ హాలిడేనా?

Harish Rao: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న వ్యవసాయ, తాగునీటి సంక్షోభం ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్లే దాపురించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన.. క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరుకే కనీస న్యాయం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో “పాత రోజులు మళ్లీ తెస్తా” అని చెప్పిన రేవంత్ రెడ్డి.. పాలమూరు జిల్లా నుంచి మళ్లీ కూలీల వలసలు ప్రారంభమయ్యేలా చేసి ఆ మాటను నిజం చేసుకున్నారని ఘాటుగా విమర్శించారు.
కరెంట్ లేదు, నీళ్లు లేవు.. రైతుల కన్నీళ్లే మిగిలాయి..
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరంతర నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక లో-ఓల్టేజీ సమస్యలతో రోజూ వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
8 గంటలకే పరిమితం..
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్.. మోటార్లు నడిపేందుకు కనీసం రోజుకు 8 గంటలు కూడా సరిగ్గా విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని మండిపడ్డారు. కేసీఆర్ స్వర్ణయుగ పాలనతో పోలిస్తే.. రేవంత్ రెడ్డి పాలన తెలంగాణకు పట్టిన పెద్ద గ్రహణంలా మారిందని వ్యాఖ్యానించారు.
ఏపీలో లేని క్రాప్ హాలిడే.. తెలంగాణలో ఎందుకు వచ్చింది?..
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి నిర్వహణను ఉదాహరణగా చూపుతూ రేవంత్ సర్కార్‌ను హరీష్ రావు నిలదీశారు. మన కళ్ల ముందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా నది నీటిని 700 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి చిట్టచివరి ప్రాంతమైన కుప్పంలో పారించుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీటిని ఒడిసిపట్టకుండా వదిలేస్తే.. చంద్రబాబు ఆ నీటిని ఒడిసిపట్టి ఏపీ రైతులకు ఇస్తున్నారు” అని పేర్కొన్నారు.
కృష్ణా నది పక్కనే ఉన్నా ఎండబెట్టారు..
కృష్ణా జలాలు తెలంగాణ మీదుగానే ఏపీకి వెళ్లాల్సి ఉండగా.. దిగువన ఉన్న ఆంధ్రాలో నీరు పుష్కలంగా ఉండి, ఎగువన ఉన్న తెలంగాణలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన నీటి హక్కులను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపించారు.
ఎల్ నినో పేరుతో తప్పించుకునే యత్నం..
తమ పరిపాలనా వైఫల్యాలు, ప్రాజెక్టుల నిర్వహణ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మంత్రులు ‘ఎల్ నినో’, ‘కాలం తెచ్చిన కరువు’ అంటూ కొత్త పేర్లు చెబుతూ ప్రజలను భయపెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
హరీష్ రావు ప్రసంగంలోని కీలక ముఖ్యాంశాలు..
  • రేవంత్ రెడ్డి ‘పాత రోజులు తెస్తా’ అన్న మాటను నిలబెట్టుకుని పాలమూరు నుంచి వలసలను మళ్లీ మొదలుపెట్టించారు.
  • స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌కే గుక్కెడు నీళ్లు, రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారు.
  • కరెంట్ కోతలు, ఎండిన పంటలతో రైతాంగం రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరవుతోంది.
  • ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ అసమర్థత తెచ్చిన మానవ నిర్మిత కరువు.
  • రేవంత్ ప్రభుత్వం వదిలేసిన నీటితో ఏపీలో కృష్ణా జలాలు పారుతుంటే.. తెలంగాణ రైతులు మాత్రం ఎండిన పంటలను చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నారు.
రైతులను ఆదుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధప్రాతిపదికన ఎండిపోతున్న పంటలకు నీటిని విడుదల చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *