Harish Rao

Harish Rao: ఓబీ పనులకు కొత్త రూల్స్ ఎందుకు? సొంత మనుషుల కోసమే నిబంధనల మార్పు

Harish Rao: సింగరేణి టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిలో జరిగిన అవినీతి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్ రావు పలు కీలక అంశాలను లేవనెత్తారు.

సింగరేణి టెండర్లలో ‘సైట్ విజిట్’ (స్థలాన్ని సందర్శించడం) నిబంధనపై భట్టి విక్రమార్క అబద్ధాలు ఆడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఓవర్ బర్డెన్ (ఓబీ) పనులకు గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధన లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తమ వారికి టెండర్లు కట్టబెట్టేందుకు దీనిని ప్రవేశపెట్టారని విమర్శించారు. దీనికి నిదర్శనంగా, 2025 జనవరిలో భూపాలపల్లిలో జరిగిన టెండర్‌లో సైట్ విజిట్ లేదని, కానీ ఆ తర్వాత మే నెలలో జరిగిన టెండర్‌లో మాత్రం ఈ నిబంధనను జోడించారని ఆయన ఉదాహరణలతో వివరించారు.

ఇది కూడా చదవండి: BRS: ఏబీఎన్ చాన‌ల్‌పై బీఆర్ఎస్ కీల‌క నిర్ణ‌యం

సింగరేణిలో కేవలం నైనీ, సోలార్ స్కామ్‌లే కాకుండా మరిన్ని కుంభకోణాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతానని హరీష్ రావు హెచ్చరించారు. “ముఖ్యమంత్రి బంధువు ఏ హోటల్‌లో కూర్చుని ఈ టెండర్లను ఖరారు చేశారో మాకు తెలుసు, దానికి సంబంధించిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత కోసం గతంలో ఉన్న స్వతంత్ర సంస్థలను పక్కన పెట్టి, కేవలం లబ్ధిదారులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ‘సైట్ విజిట్’ విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనిపై వచ్చిన ఫిర్యాదులపై సింగరేణి బోర్డు మీటింగ్‌లో ఏం చర్చించారో ఆ ‘మినిట్స్ ఆఫ్ ది మీటింగ్’ వివరాలను బయటపెట్టాలని భట్టికి సవాల్ విసిరారు. నిజం ఒప్పుకోకుండా ఈ నిందను బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టడం సరికాదని, ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *