Hyderabad: హైదరాబాద్ నగరంలోని రద్దీగా ఉండే కోఠి ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీ దోపిడీ జరిగింది. ఎస్‌బీఐ (SBI) ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్‌లో దుండగులు కాల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
ఘటన వివరాలు: శనివారం ఉదయం 7 గంటల సమయంలో రిషద్ అనే వ్యక్తి కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో నగదును డిపాజిట్ చేయడానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు, ఆయనను తుపాకీతో బెదిరించారు. ప్రతిఘటించే లోపే గాలిలోకి కాల్పులు జరిపి, ఆయన వద్ద ఉన్న రూ. 6 లక్షల నగదును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఇది కూడా చదవండి: KCR: రేపు కేసీఆర్ విచారణ.. స్టే తెచ్చుకుంటారా? హాజరవుతారా?
పోలీసుల దర్యాప్తు: పగటిపూట, అది కూడా ప్రధాన బ్యాంక్ వద్దే ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
నగరం నడిబొడ్డున జరిగిన ఈ కాల్పుల ఘటనతో కోఠి ప్రాంతంలోని వ్యాపారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
