Manchu Vishnu: నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాలపై కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు చేపట్టింది. మాదాపూర్, కావూరి హిల్స్‌లోని ఆయన ఆఫీస్‌లపై రెండు బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. తాజాగా నిర్మించిన ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు రికార్డులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, విష్ణు కార్యాలయానికి సినీనటుడు మోహన్‌బాబు చేరుకున్నారు. జీఎస్టీ తనిఖీలపై విలేకరులు ప్రశ్నించగా విష్ణు స్పందించారు. ‘మీరు చెప్పే వరకూ నాకు తెలియదు. అయినా దాచి పెట్టేదేమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది’’ అని అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘హిందీలో ఫైనల్ కాపీ చూశా. సినిమా ఆఖరిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయని అక్కడ ప్రముఖులు కొందరు అన్నారు. ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారని ఆశిస్తున్నా. దేవుడు, భక్తుడు మధ్య జరిగే కథ ఇది. కన్నప్ప గురించి ఈతరానికి తెలియాలన్న ఉద్దేశంతో తెరకెక్కించాం’’ అని తెలిపారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, మోహన్‌బాబు, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి.
