Gottipati Ravikumar: జగన్ స్వార్థ రాజకీయాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు 

Gottipati Ravikumar: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ స్వార్థ రాజకీయాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లాల్‌పురం ఘటనపై ఆవేదన

పల్నాడు పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా లాల్‌పురం వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనపై మంత్రి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, జగన్ బృందం నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని ఆరోపించారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితుడిని ఆసుపత్రికి తరలించకపోవడం హృదయ విదారకమని, కనీస మానవత్వం కూడా చూపలేదని మండిపడ్డారు.

స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినా, అప్పటికే ఆలస్యం అయ్యిందని, జగన్ కాన్వాయ్ నుంచి ఎవరైనా సహాయం చేసినా సింగయ్య ప్రాణాలు దక్కేవని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి భుజాలపై ఉందన్నారు.

ఓటు బ్యాంక్ రాజకీయాలపై విమర్శలు

సత్తెనపల్లికి చెందిన కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హడావుడి ప్రకటనలే కారణమని మంత్రి ఆరోపించారు. “వై నాట్ 175” అనే నినాదంతో కార్యకర్తలను తప్పుదారి పట్టించారని, దాంతో పాటు భారీగా బెట్టింగ్‌లు కాసిన కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయి, చాలామంది ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

నాగమల్లేశ్వరరావు మృతి చెందిన ఏడాది తర్వాత పరామర్శ పేరుతో జగన్ చేస్తున్న పర్యటనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన విమర్శించారు. “జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ బయటికి రావడమేమీ లేదు. ఇప్పుడు మాత్రం ప్రజలను కలుస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.

ప్రజల్ని మోసం చేస్తున్న జగన్: గొట్టిపాటి

“ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అంటూ గతంలో ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్, ఆ తరువాత రాష్ట్రాన్ని ముంచేశారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పాత పాట పాడుతూ మళ్లీ ప్రజల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ క్రమంగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో జగన్ ఇలా డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు మాత్రం ఇప్పుడు ఇక ఆయన మాటలకు మోసపోవరని గొట్టిపాటి స్పష్టం చేశారు. జగన్ పరామర్శలు, వాగ్దానాలన్నీ మాయ మాటలేనని, ఆయన పార్టీకి ఎటువంటి నైతిక విలువలు లేవని కఠినంగా వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *