Gorantla Madhav:వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వహరించిన 11 మంది పోలీసు అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ అరెస్టు సమయంలో కోర్టు వద్ద హాజరుపరిచే వరకూ పలుమార్లు అతను నిబంధనలను ఉల్లంఘించారని, ఆ సమయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్నది. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయతో విచారణ జరిపారు. ఆ నివేదిక ఆధారంగా 11 మందిని సస్పెండ్ చేశారు.
Gorantla Madhav:మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జీజీహెచ్ ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడటంతోపాటు కోర్టు ఆవరణలో హంగామా చేశాడని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. అదే విధంగా ఆయన ఫోన్ మాట్లాడుతున్నా అక్కడి పోలీస్ సిబ్బంది అడ్డు చెప్పలేదని విచారణలో తేలింది. మీడియా ఎదుట ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవడానికి నిరాకరించి, తనకే ముసుగు వేస్తారా? అంటూ పోలీసులపై కన్నెర్ర చేశాడు. కోర్టు వద్ద వాహనం నుంచి దిగి నేరుగా కోర్టులోకి వెళ్లిపోయాడు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని విచారణలో తేలింది.
Gorantla Madhav:ఈ మేరకు ఆరోజు విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్ల నుంచి విచారణ అధికారి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు సేకరించారు. కస్టడీలో ఉన్న నిందితుడికి మరో వైసీపీ నాయకుడు వచ్చి ఫోన్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని గుర్తించారు. ఎందుకు ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించారోనని వివరాలు సేకరించారు. ఈ కేసు వ్యవహారంలో అరండల్‌పేట, నగరపాలెం, పట్టాభిపురం పోలీసులపై పోలీస్ శాఖ ఈ సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది.
Gorantla Madhav:మాజీ ఎంపీ మాధవ్‌ను నల్లపాడు పోలీస్‌స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీసు, ఆ తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న వారిలో 11 మందిపై ఈ చర్యలు తీసుకున్నారు. వారిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. స్పెషల్ బ్రాంచి డీఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.