Gold rate: హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,00,110కి చేరింది. ఇది బంగారం ధరల చరిత్రలోనే అత్యధిక స్థాయిగా మార్కెట్ వర్గాలు ప్రకటించాయి.
ఇంతకుముందు, ఈ ఏడాది ఏప్రిల్ 22న రూ.1,00,015తో బంగారం ధర గరిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి, పసిడి ధర మరింత ఎత్తుకెగిరింది.
బంగారం ధరల ఈ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, అలాగే సరఫరా మరియు డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యత వంటి అంశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాక, యుద్ధ భయాలు, రాజకీయ అనిశ్చితి వంటి గ్లోబల్ పరిస్థితులు కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి.
ఇక దేశీయంగా, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. పసిడిని దీర్ఘకాలిక, సురక్షిత పెట్టుబడిగా భావించే కొనుగోలుదారుల సంఖ్య పెరగడంతో, డిమాండ్ మరింతగా ముదలైంది.
నిపుణుల మాటల మేరకు, సమీప భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.