Gold: బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం ఒక్కరోజే తులం బంగారం ధర సుమారు రూ.5,000 పెరిగి కొత్త ఆల్‌టైమ్ హైని తాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,954కు చేరగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులం సుమారు రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.3.25 లక్షల వద్ద ట్రేడవుతోంది.
ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక కదలికలు వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీంతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసి భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,945 డాలర్లకు ఎగబాకింది.
ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది. నిపుణుల సూచన ప్రకారం, ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేయడం మంచి వ్యూహంగా పేర్కొన్నారు. MCX మార్కెట్‌లో బంగారం ధర రూ.1,54,400 వద్ద మద్దతు పొందుతుందని, రూ.1,58,500 వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేశారు. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.1,62,000 నుంచి రూ.1,70,000 వరకు వెళ్లే అవకాశం ఉందని, వెండి ధర కూడా రూ.3,35,000 నుంచి రూ.3,50,000 స్థాయిలను తాకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగినంత కాలం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మార్కెట్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని రిస్క్ మేనేజ్‌మెంట్‌తో జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాలని సూచిస్తున్నారు.
