Aurobindo Pharma: ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి.. ఒక పరిశ్రమ ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది.. ఒక పరిశ్రమ మనుగడలో ఉంటే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడైనా.. ఎవరైనా ఇదే అనుకుంటారు. అభివృద్ధిని స్వాగతించాలనే చూస్తారు. కానీ, గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ పరిశ్రమ మాకొద్దు అంటూ గగ్గోలెత్తుతున్నారు. ఎందుకలా? ఇది తెలుసుకోవాలంటే అక్కడ రాబోతున్న పరిశ్రమ ఏమిటనేది తెలుసుకోవాలి. అదే చెప్పబోతున్నాం.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఏవీ నగర్లో కేఏసీ జెడ్ లో ఒక పరిశ్రమ ఏర్పాటుకు ఆఘమేఘాల మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసేసింది. ఎంత వేగంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో అంతకంటే వేగంగా ఆ కంపెనీ పనులు ప్రారంభించింది. ఈ పరిశ్రమ అరబిందో ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ లైఫియస్ ఫార్మా ఇండస్ట్రీస్. ఇక్కడ పెన్సిలిన్-జి అనే మెడిసిన్ ఉత్పత్తి చేస్తారు. రెండువేల కోట్ల రూపాయల ఖర్చుతో 410 ఎకరాల్లో పరిశ్రమ నిర్మాణం చకచకా సాగిపోయింది. ప్రజలంతా ఆ వేగం చూసి ఆశ్చర్యపోయారు. తమ వారందరికీ ఉపాధి దొరుకుతుందని సంబరపడిపోయారు. తమకు ఇస్తామన్న నష్టపరిహారం అందకపోయినా.. పరిశ్రమ మొదలైతే, తమ కష్టాలు తీరుతాయి కదా అని ఆశించారు. ఇలా ప్రజల ఆకాంక్షల మధ్య ఈ పరిశ్రమ ట్రయిల్ రన్ ప్రారంభం అయింది.
ఇది కూడా చదవండి: Monkeypox: కేరళలో మంకీపాక్స్ కలకలం
Aurobindo Pharma: అప్పుడు మొదలైంది అసలు కథ. పరిశ్రమ.. ఫార్మా కంపెనీ అంటే పూర్తిగా తెలీని అమాయక ప్రజలకు కంపెనీ ట్రయల్ రన్ మొదలైన తరువాత గట్టి షాక్ తగిలింది. కంపెనీ నుంచి వస్తున్న వ్యర్ధాలు తెచ్చిన ఇబ్బందులు వారి ఆశలను అడియాసలు చేశాయి. చిన్న పిల్లలు ఊపిరి తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి.. కంపెనీ నుంచి వస్తున్న వాసన (ఇది శవం కాలుతున్నపుడు వచ్చే వాసనలా ఉంటుంది) భరించలేని స్థితి.. నేరుగా వ్యర్థాలు సముద్రంలో కలుస్తుంటే.. ఎంత నష్టం జరుగుతుందో క్రమేపీ అర్ధం అయింది అక్కడి ప్రజలకు. తమ భూములు పోతాయన్న కారణంతో మొదట్లోనే పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు అక్కడి ప్రజలు. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం నయానో, భయానో వారిని ఒప్పించింది. కొందరి దగ్గర నుంచి భూములు బలవంతంగా లాక్కున్న దాఖలాలు అప్పట్లో చాల బయటపడ్డాయి.
అరబిందో ఫార్మా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా కావలసిన సంస్థ కావడం.. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ కావడంతో నిబంధనలు పక్కన పెట్టి కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు కంపెనీ నుంచి వస్తున్న ఇబ్బందులతో ప్రజలు విలవిల లాడుతున్నారు. పరిశ్రమ వలన ఉద్యోగాలు రావడం మాట అటుంచి.. ఉన్న ఉపాధి కూడా దెబ్బతింటున్న పరిస్థితి. ఇక్కడసముద్ర తీరంలో దాదాపు 500 హ్యాచరీలు ఉన్నాయి. వాటిలో ఒక్కోదానిలో 50 మంది వరకూ పనిచేస్తుంటారు. అంటే సుమారుగా 20 వేల నుంచి 25 వేల మంది వరకూ వీటిద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు అరబిందో సంస్థ నిర్వాకంతో పెన్సిలిన్ జి ఉత్పత్తి సమయంలో వస్తున్న వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. రీసైక్లింగ్ చేయాలనే నిబంధన కూడా పక్కన పెట్టి సముద్ర తీర ప్రాంతాన్ని కాలుష్య భరితం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమల దర్శనాల కోసం ఏకంగా హోమ్ మంత్రినే వాడేశాడు.. చివరికి ఏమైందంటే..
Aurobindo Pharma: అరబిందో ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ కాలుష్య కారక పరిశ్రమగా ఉంటుందనే నిజం అందరికీ అర్ధం అవుతూనే ఉంది. ఇప్పుడు కంపెనీని అక్కడ ప్రారంభం కాకుండా నిలువరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడి ప్రజానీకం ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకుంటుందని.. దానిని ఇక్కడ ప్రారంభించకుండా చర్యలు తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు.