Gade innaiah: చంచల్గూడా జైలుకు గాద ఇన్నయ్య.. 14 రోజుల రిమాండ్

Gade innaiah: మావోయిస్టులకు మద్దతిచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు

అరెస్ట్ అనంతరం గాదె ఇన్నయ్యను హైదరాబాద్‌లోని NIA ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల్లో గాదె ఇన్నయ్య మావోయిస్టు ఉద్యమానికి మద్దతుగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు మద్దతు ఇవ్వడం, వారి కార్యకలాపాలను ప్రోత్సహించడం, ప్రజలను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించడమే కేసుకు కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గాదె ఇన్నయ్యపై ఉపా చట్టం (UAPA) సెక్షన్లు 13, 29 భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152 కింద కేసులు నమోదు చేశారు.

ఇన్నయ్యపై ఉపా కింద కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా ఆయనపై ఇదే తరహా ఆరోపణలతో కేసు నమోదైంది. అప్పట్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్నకు నిధులు సమకూర్చారని ఆరోపణలు వచ్చాయి.

గతంలో నక్సలైట్‌గా ఉన్న గాదె ఇన్నయ్య, ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మారారు. ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ రావడంతో, కొంతకాలంగా ఎన్ఐఏ నిఘాలో ఉన్నట్లు సమాచారం. తాజా అరెస్టుతో అర్బన్ నక్సల్స్‌, మావోయిస్టు సానుభూతిపరులపై ఎన్ఐఏ తన దృష్టిని మరింత కేంద్రీకరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *