Gaddar Film Awards: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ సినీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, సినీ తారల తళుకు బెళుకుల నడుమ కార్యక్రమమంతా ఆసాంతం సందడిగా సాగింది. దశాబ్దం కాలం తర్వాత జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంపై సినీరంగంలోని అతిరథ మహారథులు తరలివచ్చారు.
Gaddar Film Awards: ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌కు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డులను బహూకరించారు. మరో వైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఇతర పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు.
Gaddar Film Awards: సీఎం రేవంత్‌రెడ్డి ఈ సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏండ్ల క్రితం నిలిచిన నంది సినీ అవార్డుల కార్యక్రమానికి గద్దర్ సినీ అవార్డుల పేరిట తమ ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గతంలో బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వేర్వేరుగా చూసేవారని, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అనే స్థాయికి తీసుకొచ్చారని, అందుకు హైదరాబాద్ వేదిక కావడం ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క సినీ కళాకారుడికి అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పైకి కఠినంగా కనిపిస్తున్నా, సినీ పరిశ్రమను అభినంగానే చూసుకుంటుందని సినీ వర్గాలకు సీఎం రేవంత్‌రెడ్డి అభయం ఇచ్చారు.
Gaddar Film Awards: గద్దర్ అవార్డులను అందుకున్న విజేతలు, ఇతర కళాకారులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కళా చైతన్యమే రాష్ట్రాభివృద్ధికి స్ఫూర్తి అని, వేగుచుక్క లాంటి గద్దర్ స్ఫూర్తితో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తామని హామీ ఇచ్చారు. గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.
Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆసాంతం సంగీత దర్శకులు థమన్, ఎంఎం కీరవాణి, రామ్ మిరాయాల, మంగ్లీ, భీమ్స్ ఆలపించిన పాటలు సభికులను ఉర్రూతలూగించాయి. ఈ సందర్భంగా ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సత్కరించారు. వారి ప్రతిభను కొనియాడారు.
Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. అగ్ర హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మణిరత్నం, బోయపాటి శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి రవి, నవీన్, సురేశ్ బాబు, సీనియర్ నటీమణులు జయప్రద, జయసుధ, సుహాసిని తదితరులు హాజరై సందడి చేశారు.

