Foxconn: ఐఫోన్ల తయారీ యూనిట్‌లో భారీ నియామకాలు

Foxconn: చైనా నుంచి తయారీ వ్యవస్థలను భారత్‌కు మళ్లించే దిశగా అడుగులు వేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ, కర్ణాటకలోని తన ఐఫోన్ తయారీ యూనిట్‌లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో కేవలం 8–9 నెలల వ్యవధిలోనే సుమారు 30 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో 80 శాతం మంది మహిళలే ఉండటం విశేషం.

300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవనహళ్లి యూనిట్ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ కేంద్రంగా నిలిచింది. మొదటగా ఐఫోన్ 16 మోడల్ ఉత్పత్తి ప్రారంభించిన ఈ యూనిట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్ల తయారీ కూడా కొనసాగుతోంది. ఇక్కడ తయారవుతున్న ఐఫోన్లలో సుమారు 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఉద్యోగుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫాక్స్‌కాన్ సంస్థ, ఈ యూనిట్‌ను మినీ టౌన్‌షిప్ తరహాలో అభివృద్ధి చేసింది. నివాస వసతులు, వైద్య సేవలు, విద్యా సదుపాయాలు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నాటికి ఉద్యోగుల సంఖ్యను 50 వేల వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫాక్స్‌కాన్‌కు ఇది తమిళనాడులోని ఐఫోన్ ప్లాంట్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్ట్. తమిళనాడు యూనిట్‌లో ప్రస్తుతం 41 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అక్కడ కూడా మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. డిజైన్‌, టెక్నాలజీ విభాగాల్లో మహిళలను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో నియామకాలు చేస్తున్నట్లు ఫాక్స్‌కాన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *