Amaravati: మంత్రి నారా లోకేశ్‌ను కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి వర్గాలు వెల్లడించాయి.
గతంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహించిన సమయంలో అమ్మిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ట్వీట్ ద్వారా మంత్రి నారా లోకేశ్ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఫిర్యాదు అందడంతో, శాసనమండలి ఈ అంశాన్ని పరిశీలించి హక్కుల కమిటీకి (ప్రివిలేజెస్ కమిటీ) అప్పగించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే హక్కుల కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని అమ్మిరెడ్డిని నోటీసుల్లో ఆదేశించారు. కమిటీ ముందు ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
