Road Accident: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. జాతీయ రహదారి 40 పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలో శ్రీవారి దర్శనం ముగించుకుని తిరిగి హైదరాబాద్కు ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం, నల్లగట్ల-బత్తలూరు గ్రామాల మధ్య అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. వేగంగా ఉన్న ఆ వాహనం డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును నేరుగా ఢీకొనడంతో ఈ ఘోరం సంభవించింది.
ఈ ప్రమాద ధాటికి క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరినీ హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని ప్రాథమిక చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Tirumala: తిరుమలలో భక్తుల కోలాహలం.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ!
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు మాత్రం ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి వారిని వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. ప్రమాద స్థలాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ కె.ప్రమోద్ కుమార్ పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
