Formula E Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదాస్పద అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఈ రోజు ఉదయం మరోసారి అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణకు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఈ విచారణ జరుగనుంది.
ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీతో పాటు ఈడీ అధికారులు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక అంశాలు, నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధుల మంజూరులో మాజీ పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వివరణల ఆధారంగా, కీలకంగా మళ్లింపులపై కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
నిబంధనలు బేఖాతరు?
ఫార్ములా ఈ నిర్వహణలో క్యాబినెట్ ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలు, సచివాలయ వ్యాపార నిబంధనల ఉల్లంఘన, నిధుల మళ్లింపులు వంటి అంశాలపై ఏసీబీ అధికారుల దృష్టి కేంద్రీకరించబడింది. కేటీఆర్ పైన ఈ విషయాలను బట్టి మరింత లోతుగా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విచారణ అనంతరం చార్జిషీట్ దాఖలుకు ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం.
రాజకీయ కుట్ర?
ఇక ఈ కేసుపై కేటీఆర్ అభిప్రాయం మాత్రం విభిన్నంగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, తన పరాజయాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దారిమళ్లించేందుకు ఈ కేసును వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
“ఈ కేసులో అవినీతి లేదు, విచారణకూ పస లేదు. అయినా నేను చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు హాజరవుతున్నాను” అని గతంలో వెల్లడించిన ఆయన, సోమవారం కూడా అదే దృక్పథంతో విచారణకు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Digital Fasting: డిజిటల్ ఉపవాసం అంటే ఏంటో తెలుసా?
బందోబస్తు ఏర్పాట్లు
కేటీఆర్ విచారణ నేపథ్యంలో, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయం వద్దకు చేరే అవకాశం ఉన్నందున, పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన కేటీఆర్, 10 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈసారి విచారణను డీఎస్పీ మాజీద్ ఖాన్ నేతృత్వంలో, జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అదనపు ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు కొత్త అధికారుల బృందం జరపనుంది. మొత్తం ఆరుగురు అధికారిలు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్టు సమాచారం.