Telangana

Telangana: 40 ఏళ్ల తర్వాత మళ్లీ పరీక్ష హాల్‌లోకి.. మాజీ మావో అగ్రనేత

Telangana: చదువుకోవాల్సిన వయసులో సమాజం కోసం, ప్రజల కోసం పోరాడాలని ఆయన అడవి బాట పట్టారు. తుపాకీ చేతపట్టి దశాబ్దాల పాటు పోరాటం చేశారు. సుమారు 40 ఏళ్ల పాటు అడవిలోనే గడిపిన ఆయన, ఇటీవలే జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆయనే మావోయిస్ట్ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. అయితే, అప్పట్లో అడవికి వెళ్లడం వల్ల ఆయన చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు తన 60 ఏళ్ల వయసులో, ఎక్కడైతే చదువు ఆగిపోయిందో అక్కడే మళ్లీ మొదలుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.

తాజాగా మే 13, 2026న జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్షకు తిరుపతి హాజరయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాస్ట్రో జూనియర్ కాలేజీలో ఆయన పరీక్ష రాశారు. 40 ఏళ్ల క్రితం ఆయన ఇంటర్ చదువుతున్న సమయంలో కొన్ని సబ్జెక్టులు తప్పారు. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్లడంతో మళ్లీ పరీక్షలు రాసే అవకాశం రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఎలాగైనా ఇంటర్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.

చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్ పట్టుకుని ఒక సామాన్య విద్యార్థిలా ఆయన కాలేజీకి వచ్చారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద నిబంధనల ప్రకారం హాల్ టికెట్ వెరిఫికేషన్ చేయించుకుని లోపలికి వెళ్లారు. తరగతి గదిలో తనకంటే వయసులో చాలా చిన్నవారైన విద్యార్థులతో కలిసి కూర్చుని ఆయన పరీక్ష రాయడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. చదువుకోవాలనే కోరికకు వయసుతో సంబంధం లేదని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు.

జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత తన లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్య అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమని, అందుకే తన ఆగిపోయిన చదువును పూర్తి చేయాలని భావించినట్లు వెల్లడించారు. ఈ మాజీ అగ్రనేత తీసుకున్న నిర్ణయం పట్ల అటు విద్యావేత్తలు, ఇటు సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *