flydubai-flight-indian-pilot-captain-smit-machchhar-bravery-saves-180-passengers-gofundme-donations

Smit Machchhar: ప్రపంచం మెచ్చిన ధైర్యం.. ‘GoFundMe’ ద్వారా ₹1.18 కోట్ల విరాళాలు!

Smit Machchhar: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని ఉపద్రవం ఎదురైనప్పుడు.. చావుబతుకుల మధ్య పోరాటం చేయాల్సి వచ్చిన సమయంలో ఆ భారతీయ పైలట్ ఏమాత్రం భయపడలేదు. తనపై తోటి కో-పైలట్ తీవ్రంగా దాడి చేసి గాయపరిచినప్పటికీ, ప్రాణాలకు తెగించి చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దింపి ఏకంగా 180 మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆ ధైర్యశాలి మరెవరో కాదు.. మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్! ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో ఆయన చూపిన అసాధారణ సమయస్ఫూర్తి, నిబద్ధత ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.

కాక్‌పిట్‌లో ఊహించని దాడి – 180 మందికి పునర్జన్మ..

ఫ్లైదుబాయ్ విమానం వేలాది అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది.. కాక్‌పిట్‌లో ఉన్న కో-పైలట్ ఊహించని రీతిలో ప్రధాన పైలట్ అయిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై భౌతిక దాడికి దిగాడు. శరీరం తీవ్ర గాయాలపాలై రక్తం కారుతున్నా, విపరీతమైన నొప్పి వేధిస్తున్నా సరే కెప్టెన్ మచ్చర్ స్టీరింగ్‌‌పై నియంత్రణ కోల్పోలేదు. విమానం అదుపు తప్పితే పెను విపత్తు జరుగుతుందని గ్రహించి, తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ విమానాన్ని నియంత్రణలోకి తెచ్చారు.
విమానంలోని 180 మంది ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగకుండా వారిని సురక్షితంగా నేలకు చేర్చారు. చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు కెప్టెన్ సాహసానికి చేతులెత్తి మొక్కుతున్నారు.
ఆస్పత్రిలో చికిత్స – వెల్లువెత్తుతున్న ఆర్థిక సాయం..
ఈ దాడి తీవ్రత కారణంగా తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు.. ప్రాణాలను పణంగా పెట్టి 180 మంది జీవితాలను నిలిపిన ఈ నిజమైన హీరోకు బాసటగా నిలవడానికి ప్రపంచవ్యాప్తంగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇందుకోసం ప్రముఖ క్రౌడ్‌ఫండింగ్ వేదిక ‘GoFundMe’ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు.
₹1.18 కోట్లకు పైగా విరాళాలు..

చాలా తక్కువ సమయంలోనే దాదాపు 1,700 మందికి పైగా దాతలు స్పందించి ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు $1,41,802 (భారత కరెన్సీలో సుమారు ₹1.18 కోట్లకు పైగా) విరాళంగా అందించారు. వృత్తిధర్మాన్ని, మానవత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకుని తిరిగి విమానాన్ని నడపాలని ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు, ఏవియేషన్ నిపుణులు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *