Revenge for Gaza

Revenge for Gaza: ఉద్యోగంలో చేరకముందే హైజాక్ ప్లాన్.. భారత కెప్టెన్ సాహసంతో తప్పిన పెను ముప్పు!

Revenge for Gaza: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు 170 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ‘ఫ్లైదుబాయ్’ విమానంలో మిడ్-ఎయిర్ దాడికి తెగబడ్డ ఒమన్ దేశస్థుడైన సహ-పైలట్ (కో-పైలట్) హుమామ్ అల్-హమ్మామి విచారణలో అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసే షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో జరిగిన 9/11 తరహాలోనే టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపై లేదా నగరంలోని ఆకాశహర్మ్యాలపై ఈ విమానాన్ని కూల్చివేసి సామూహిక మారణహోమం సృష్టించాలని నిందితుడు ముందస్తు పన్నాగం పన్నినట్లు అంతర్జాతీయ, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు నిర్ధారించాయి. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పోలీసుల కస్టడీలో ఉన్న హుమామ్ అల్-హమ్మామిని యూఏఈ భద్రతా సంస్థలతో పాటు ఇజ్రాయెల్ నిఘా విభాగం అధికారులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగంలో చేరకముందే ఆత్మాహుతి కుట్ర – గాజా ప్రతీకారమే లక్ష్యం..

‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పత్రిక కథనం ప్రకారం దర్యాప్తులో వెల్లడైన కీలక అంశాలు.. టెల్ అవీవ్‌కు విమానాలు నడిపే ఎయిర్‌లైన్స్ వివరాలను సేకరించి, వ్యూహాత్మకంగా ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు హుమామ్ విచారణలో అంగీకరించాడు. సంస్థలో విధుల్లో చేరకముందే విమానాన్ని టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టులో లేదా కీలక ప్రాంతాల్లో కూల్చేయాలని పథకం రచించాడు.
గాజా యుద్ధానికి ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని, అమరవీరుడిగా చనిపోవాలనేదే తన లక్ష్యమని నిందితుడు పేర్కొన్నాడు. ఇజ్రాయెల్‌కు శత్రు దేశాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇతగాడు గతంలో రహస్య పర్యటనలు చేసినట్లు గుర్తించారు. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా లేక వ్యక్తిగత వికృత ఆలోచనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

కాక్‌పిట్‌లో ఏం జరిగింది? – భారత కెప్టెన్ అప్రమత్తత..

ఇటాలియన్ వార్తాపత్రిక ‘కొరియెర్ డెల్లా సెరా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయాణం మధ్యలో ఉండగా హుమామ్ ప్రార్థన చేసుకోవడానికి కాసేపు విరామం కోరాడు.
  • విరామం అనంతరం కాక్‌పిట్‌లోకి వచ్చి ఒక్కసారిగా క్రాష్ గొడ్డలితో భారత ప్రధాన పైలట్ (కెప్టెన్) స్మిత్ మచ్ఛార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
  • తీవ్రంగా రక్తస్రావమవుతున్నా కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, వెంటనే కాక్‌పిట్ తలుపులను లోపలి నుంచి అన్‌లాక్ చేసి ప్యాసింజర్ క్యాబిన్‌ను, విధుల్లో లేని (ఆఫ్-డ్యూటీ) పైలట్‌ను అప్రమత్తం చేశారు.
  • నిందితుడు విమాన కంట్రోల్స్‌ను ధ్వంసం చేసి ఏకంగా 14,000 అడుగుల మేర నిటారుగా కిందకు దించి ఎడారిలో లేదా సముద్రంలో కూల్చేయడానికి యత్నించాడు.
  • ఈలోపు ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది, ఆఫ్-డ్యూటీ పైలట్లు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి హుమామ్‌ను బలవంతంగా పట్టుకుని తాళ్లతో బంధించారు. వెంటనే విమానాన్ని స్వాధీనం చేసుకుని సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఉదయం 10:57 గంటలకు సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

150 మంది పౌరులున్నా కూల్చేయడానికి సిద్ధమైన ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్..

విమానం అదుపు తప్పి 14,000 అడుగులు పడిపోవడం, కాక్‌పిట్ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఇజ్రాయెల్ తీవ్ర ఉద్రిక్తతకు లోనైంది:
  • టెల్ అవీవ్‌లోని అజ్రియేలీ టవర్లు లేదా ఇతర నివాస ప్రాంతాలపై విమానం పడితే వేల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుందని భద్రతా దళాలు అంచనా వేశాయి.
  • విమానంలో 150 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ఉన్నప్పటికీ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా గాల్లోనే ఫైటర్ జెట్లతో ఆ విమానాన్ని కూల్చివేయడానికి (Shoot down) అత్యవసర కమాండ్ సెంటర్ నిర్ణయించింది.
  • అయితే భారత కెప్టెన్ చాకచక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చి, విమానం సౌదీ వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలను వెనక్కి పిలిపించింది.
ఈ పెను విపత్తు త్రుటిలో తప్పినప్పటికీ.. ఇంతటి తీవ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తి విమాన పైలట్‌‌గా చేరిన విషయాన్ని ముందే గుర్తించలేకపోయారంటూ మొసాద్, షిన్ బెట్ వంటి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *