Fish Venkat: టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ
53 ఏళ్ల ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు పూర్తిగా పాడవడంతో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఐసీయూలో ఉంచి, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితి విషమించింది. బీపీ, షుగర్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే ఒక్కటే మార్గమని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు – సాయం చేసిన సినీ పరిశ్రమ
కిడ్నీ మార్పిడి కోసం ఆయన కుటుంబం తీవ్రంగా కృషి చేసింది. కానీ ఆపరేషన్ ఖర్చు ఎక్కువ కావడంతో కుటుంబం ఇబ్బందులు పడింది. సినీ పరిశ్రమలోని కొంతమంది సాయం చేసినా, అవసరమైన మొత్తం చేరలేదు. చివరికి ఆయన ప్రాణాలు నిలువలేదు.
ఇది కూడా చదవండి: Darshan: దర్శన్ బెయిల్‌పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!
వెండి తెరపై ఫిష్ వెంకట్
ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియస్ లుక్‌తో కామెడీ చేయడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ‘ఆది’ సినిమాలో ఆయన చెప్పిన “తొడ కొట్టు చిన్నా” డైలాగ్ ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చింది. అలాగే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా నవ్వించింది. నాయక్, బన్నీ, అదుర్స్, ఆంజనేయులు వంటి ఎన్నో సినిమాల్లో విలనిజం, హాస్యం కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వ్యక్తిగత జీవితం
ఫిష్ వెంకట్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఆయన అనారోగ్యంతో గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. పలు ఇంటర్వ్యూల్లో తన ఆరోగ్య పరిస్థితిని వివరించి సాయం కోరారు.
సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి
ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్‌లో ఆయన సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.